రాష్ట్ర వార్తలు

రేపు ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి శ్రీకారం

  • 13/09/2012

విజయవాడ, సెప్టెంబర్ 12: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఈ నెల 14న భారీ బహిరంగ సభ ద్వారా నందిగామలో శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర మాజీ హోం మంత్రి, ఆంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసి) గౌరవాధ్యక్షుడు వసంత నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సభకు సీమాంధ్ర నలుమూలల నుంచి వివిధ పార్టీల నేతలు ప్రజాప్రతినిధులు స్వాతంత్య్ర సమరయోధులు, న్యాయవాదులు, మేధావులు, కార్మిక సంఘాల నేతలు, వైద్యులు, రైతులు, విద్యార్థులు తరలిరానున్నారని చెప్పారు. సిపిఎం మినహా అన్ని రాజకీయ పక్షాల్లోనూ ఓ వైపున తెలంగాణ వాదం వినిపిస్తుండగా సీమాంధ్ర నేతలు వౌనం దాల్చడంలో అర్ధం లేదన్నారు. బుధవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన తీవ్ర ఆవేశంతో స్పందించారు. వ్యాపారాల ద్వారా ఎంపీలైన వారికి చరిత్ర గురించి ఏమి తెలుసంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి సిఎంలుగా పనిచేసినా ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదన్నారు. స్వాతంత్య్రం ముందు సర్ ఆర్థర్‌కాటన్ మహాశయుని పుణ్యమా అని కృష్ణా, గోదావరి డెల్టాలు ఆవిర్భవించాయన్నారు. తెలంగాణకు ఎంతకాలం ఊడిగం చేస్తామంటూ ప్రశ్నించారు. సాగునీటి వనరులతో తెలంగాణలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాయని పరిశ్రమలతో రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందినదన్నారు. రాష్ట్రం విడిపోతే మన మేధస్సుతో మనమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలమన్నారు. 1100 కి.మీ కోస్తా కారిడార్‌లో గ్యాస్ నిక్షేపాలు ఖనిజ సంపద, నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని అన్నారు.
చిన్న రాష్ట్రాల వల్ల తీవ్రవాదం పెచ్చుమీరుతుందంటూ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన ప్రకటనలో వాస్తవం లేదని, నేలపై నడిచే మనిషితోపాటు ఆకాశంలో ఎగిరే పక్షికి సైతం ఆహారం అందించే సంస్కృతి ఈ ప్రాంతాలలో ఉందంటూ వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని వసంత డిమాండ్ చేశారు. ఆయనకంటే ఎంతోముందుగా హోం మంత్రిగా పని చేశాను. రాష్ట్రం గురించి ఆయనకేమి తెలుసని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను సముదాయించడానికి బడ్జెట్‌లో మూడింట రెండువంతులు ఆ ప్రాంతానికే కేటాయిస్తూ కనీసం పులిచింతల, పోలవరం, గుండ్లకమ్మ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కూడా కేటాయించడంలేదన్నారు. 1972లోనే కాకాని నాయకత్వంలో తాము ప్రత్యేకాంధ్ర కోసం వీరోచిత పోరాటం చేసామని, ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ ఆలోచనలు మారలేదన్నారు. 14న నందిగామలో జరిగే బహిరంగ సభలో మాజీ ఎంపి యలమంచిలి శివాజీ, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు ఎంవి రమణారావు, బొద్దులూరి రామారావు, కంభంపాటి హరిబాబు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డిసి రోశయ్య, ప్రజ్ఞా భారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి తదితరులు పాల్గొంటారని చెప్పారు.
సభకు అనుమతి నిరాకరణ
ప్రత్యేకాంధ్ర జెఎసి ఈ నెల 14వ తేదీన నందిగామలో తలపెట్టిన బహిరంగ సభకు ఊరూవాడ వాల్‌పోస్టర్లు, కరపత్రాలు ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఒక్కసారిగా పోలీసులు ఆ సభకు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అనుమతివ్వటం లేదంటూ నందిగామ ఎస్‌ఐ తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులతో వసంత నాగేశ్వరరావు సంప్రదింపులు సాగిస్తున్నారు. ఏదిఏమైనా సభను నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. మరోవైపు సమైక్యవాదులు ఈ సభను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Add new comment

CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
Loading