కృష్ణ

జై ఆంధ్రా, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిన నందిగామ

  • 15/09/2012

నందిగామ, సెప్టెంబర్ 14: ఒకపక్క జై ఆంధ్రా, జైజై ఆంధ్రా, వసంత జిందాబాద్ నినాదాలు, మరోపక్క సమైక్యాంధ్ర వర్ధిల్లాలి, లగడపాటి జిందాబాద్ అనే నినాదాలతో నందిగామ పట్టణం శుక్రవారం హోరెత్తింది. ప్రత్యేకాంధ్ర కోరుతూ ఆంధ్ర జెఎసి గౌరవాధ్యక్షుడు వసంత నాగేశ్వరరావు నాయకత్వంలో స్థానిక వజినేపల్లి గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు జరగ్గా ఈ సభను అడ్డుకునేందుకు ఎంపి లగడపాటి వర్గీయులైన డిసిసి అధ్యక్షుడు నరహరిశెట్టి నర్శింహరావు, సమైక్యాంధ్ర జెఎసి నాయకుడు శ్రీహరి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వేల్పుల పరమేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలేటి సతీష్, స్థానిక మార్కెట్ యార్డ్ చైర్మన్‌లు ముక్కపాటి నర్శింహరావు, బొమ్మిశెట్టి భాస్కరరావు, కాలవ వాసుదేవరావు, జగ్గయ్యపేటకు చెందిన నాయకులు ఇంటూరి చిన్నా, ఆకుల బాజీ తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరంతా ప్రదర్శనగా సభాప్రాంగణం వద్దకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తూ సమైక్యాంధ్ర వర్థిల్లాలి, లగడపాటి జిందాబాద్ అంటూ నినాదాలుచేశారు. సభా ప్రాంగణంకు వివిధప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ట్రాక్టర్‌లు, ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాల్లో వసంత అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బిజెపి నాయకులు చేరుకొని జై ఆంధ్రా, జైజై ఆంధ్రా అంటూ నినాదాలు చేశారు. సభలో పాల్గొనేందుకు జెఎసి గౌరవాధ్యక్షుడు వసంత నాగేశ్వరరావు, అధ్యక్షుడు సుంకర కృష్ణమూర్తి, నాయకులు కాకాని హరిబాబు, చెన్నుపాటి శివయ్య, పెద్దబ్బాయి, కోటేశ్వరరావు, వైఎస్‌ఎన్ ప్రసాద్ తదితరులతో కలిసి వస్తుండగా స్థానిక బైపాస్ రోడ్డు వద్ద నందిగామ, జగ్గయ్యపేట, జంక్షన్ సిఐలు భాస్కరరావు, కిషోర్‌బాబు, విజయరావు, పలు పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు సిబ్బందితో అడ్డుకున్నారు. గృహ నిర్బంధంకు తరలించాలని ప్రయత్నించారు. దీన్ని వసంత అభిమానులు ప్రతిఘటించారు. వసంతతో పాటు కార్యకర్తలు జాతీయ రహదారిపై భైటాయించారు. ఈ సమయంలోనే ఇన్‌చార్జి డిఎస్‌పి చెన్నయ్య అదనపు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. దాదాపు గంటన్నరకు పైగా వాహనాల రాకపోకలను నేతలు అడ్డుకున్నారు. ఇదే సందర్భంలో విజయవాడ నుండి యువజన కాంగ్రెస్ నాయకుడు దేవినేని అవినాష్ పలువురు యువకులతో అక్కడికి చేరుకొని సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ నినాదాలు చేసారు. కాగా వసంతతో పోలీసు అధికారులు పలుమార్లు చర్చలు జరిపినా ఆయన వెనక్కు వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో ఆయనతో సహా నేతలను అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు, ఆ తరువాత ఐతవరంలోని వారి గృహం వద్దకు తరలించారు. ఇక్కడ ఆందోళన జరుగుతున్న సమయంలోనే మాజీ ఎమ్మెల్యే బొద్దులూరి రామారావు వజినేపల్లి గార్డెన్‌లో జెఎసి నాయకుడు జైబాబు ఆధ్యక్షతన సభ ప్రారంభించారు. సభలో సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రజ్ఞ్భారతి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి, బిజెపికి చెందిన మాజీ ఎమ్మెల్యే కంభంపాటి హరిబాబు, రాయలసీమ రాష్ట్ర సమితి నేత కుంచం వెంకట సుబ్బారెడ్డి, జై ఆంధ్రా నాయకులు మల్లెల పద్మనాభశర్మ, బిజెపి నాయకులు సైదా, విశే్వశ్వరరావు, పసుపులేటి శ్రీకృష్ణ, కీసర రాంబాబు, మనె్న శ్రీనివాసరావు తదితరులు పాల్గొనగా ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులు రేపాల మోహనరావు, చిరుమామిళ్ల చైతన్యకుమార్, చతుర్వేదుల రామకృష్ణ, తునికిపాటి సాయి, గింజుపల్లి అనిల్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. నేతల ప్రసంగాలు జరుగుతుండగానే జగ్గయ్యపేట సిఐ కిషోర్‌బాబు అదనపు పోలీసు బలగాలతో అక్కడకు చేరుకొని సభకు అనుమతి లేదంటూ ముఖ్యనేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభ అర్థాంతరంగా నిలిచిపోయింది. వివిధ ప్రాంతాల నుండి పెద్దసంఖ్యలో వచ్చిన ప్రజలు భోజనాలు చేసి వెళ్లిపోయారు. కాగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఎంపి లగడపాటి వర్గీయులు సమైక్యాంధ్ర వర్థిల్లాలి అని నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వేదిక వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముఖ్యనేతలు 15మందిని అరెస్టుచేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

==============
డీజిల్ ధర పెంపుపై టిడిపి వినూత్న నిరసన
మచిలీపట్నం టౌన్, సెప్టెంబర్ 14: డీజిల్ ధర పెంపుపై తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వాహనానికి తాడు కట్టి కొద్ది దూరం లాగి నిరసన తెలిపారు. అనంతరం కోనేరుసెంటరులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం ఇప్పటికే అనేక విడతలు పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. తాజాగా మళ్లీ డీజిల్ ధరను పెంచి ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపారన్నారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, మోటమర్రి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, బత్తిన దాస్, సాతులూరి నాంచారయ్య, వివి చౌదరి, ఇలియాస్ పాషా, అంగర శ్రీనివాస్, కాగిత సాంబశివరావు, చండిక పాండురంగారావు, నీలం రామకృష్ణ, అంగర తులసీదాస్, ఎ రాజా, శివకోటి రాజేంద్ర ప్రసాద్, పద్మనాభుని శేఖర్, మోకా రాజు, బచ్చుల బోస్, చింతా చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Add new comment

CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
Loading