అర్చన మెయిన్ ఫీచర్

ఆదిత్యాయ.. నమోస్తుతే...

  • - ఉరిటి శ్రీనివాస్
  • 29/01/2012

ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు లోకాలను ప్రకాశింప చేసే సూర్యనారాయణ స్వామివారు కొలువై ఉన్న మహా పుణ్యక్షేత్రం అరసవల్లి దివ్యధామం.
‘‘హర్షవల్లీ పురీవాసం ఛాయోషా పద్మినీయతమ్! సర్వదేవనుతం నౌమి భాస్కరం మంగళాకరమ్!! అంటూ సూర్యనారాయణ స్వామిని ధ్యానించి పూజలు చేసే ఈ మహిమాన్వితమైన క్షేత్రంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల కంటే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజు జరిగే వేడుకలకే ప్రాధాన్యత ఉంది. అర్ధరాత్రి దాటిన తరువాత సప్తమి ఘడియలు ప్రారంభమైన నాటి నుంచి స్వామివారికి క్షీరాభిషేక మహోత్సవాన్ని అత్యంత ఘనంగా జరిపించడం తర తరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. సూర్యుని ఆరాధన అతి ప్రాచీనమైనది.
సమస్త జీవరాశులకు ఆధార భూతుడు. సూర్యుని కిరణాలు సోకని జగత్తే లేదు. అందుకే ‘సుష్టు ఈదయితి సూర్యః’ అంటారు. సృష్టిలో నవగ్రహాలకు, అష్టదిక్పాలకులకు, పంచభూతాలకు అధిపతి ఆయనే. ప్రపంచంలోని అన్ని చోట్లా సూర్యుని పూజిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో దేవతలచే ప్రతిష్టించబడిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి రోజున సూర్యజయంతిగా ఉత్సవాన్ని జరుపుతారు. ఆదిత్యుని నిజరూప దర్శనం లభించేది ఈ రోజు మాత్రమే
ఈ రోజున అరసవల్లిలో భక్తులు ఆదిత్యుని దర్శనానికై బారులుతీరుతారు.‘‘ యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఖిలమ్‌యచ్చంద్రమసియచ్ఛాగ్నౌ తత్తేజోవిద్ధి మామకయ్!! అంటూ గీతాచార్యుడు భగవద్గీతలో బోధించిన విధంగా లోకాన్ని ప్రకాశింప చేసే సూర్యునిలో తేజస్సు నాదేనని, ‘జ్యోతిషాం రవి రంశుమాన్’ నేనే సూర్యభగవానుడనని సెలవిచ్చారు. అందుకే పరమాత్ముడే కొలువై ఉన్న అరసవల్లి పుణ్యక్షేత్రంలో ఆదిత్యుని రూపంలో స్వామిని కొలిచేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ రథసప్తమికి ఓ ప్రత్యేకత ఉంది. ఏటా మాఘశుద్ధ సప్తమి సందర్భంగా ఆదిత్యునికి క్షీరాభిషేకం జరుపుతారు. రథసప్తమిని జయ సప్తమి అనీ పిలుస్తారు. ప్రభవ నామ సంవత్సరం, మాఘశుద్ధ సప్తమి ఆదివారం కృత్తిక నక్షత్రంలో సృష్టి ప్రారంభంలో శ్రీ సూర్యనారాయణుడు జన్మించారని స్థల పురాణంలో చెప్తోంది. రథసప్తమి రోజున ఆదిత్యుని సేవించడం వలన రోగ, శోక, పాపాలు నశిస్తాయనేది భక్తుల నమ్మకం. అరసవల్లిలో కొలువై ఉన్న ప్రభాకరుని సన్నిధిలో రథసప్తమి రోజున ప్రాతఃకాలంలో మహా అభిషేక సేవ, పంచామృతాభిషేక సేవ, సుగంధ ద్రవ్యాలతో మూల విరాట్‌కు విశేషాభిషేకాలు చేయడం ఇక్కడి సంప్రదాయం.
సూర్యజయంతి రోజున ఎర్రచందనంతో అష్టదళ పద్మం వేసి సూర్యనారాయణ స్వామివారిని ఆవాహన చేసి ఉపచార పూజలు చేయాలి. రాగి పాత్రలో పాలు, ఎర్రచందనం, మందార పువ్వులు కలిపిన పదార్ధంతో సూర్యునికి అభిముఖంగా నిలబడి అర్ఘ్యం వదిలితే స్వామి సంతృప్తి చెందుతారని, భక్తులకు భోగ భాగ్యాలు కలుగ చేసి వచ్చే జన్మలో కూడా ఎటువంటి రోగాలు దరిచేరకుండా దీర్ఘాయుస్సు ప్రసాదిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆవుపేడతో తయారు చేసిన గొబ్బిపిడకలతో పొయ్యి మీద బియ్యం, పాలు, బెల్లం తో తయారు చేసిన క్షీరాన్నాన్ని తెల్ల జిల్లేడు ఆకులుపై గాని, చిక్కుడు ఆకులపై గాని నైవేద్యంగా స్వామికి సమర్పించాలి. ఏకభుక్తంతో ఉంటూ ఈ ప్రసాదాన్ని స్వీకరించిన వారికి శ్వాశకోస, చర్మ వ్యాధులు, నరాల సంబంధ వ్యాధులు నశిస్తాయని పురాణాల్లో లిఖించబడి ఉంది. తెల్ల జిల్లేడు, పందిరి చిక్కుడు ఆకులు, రేగు పండ్లకు సౌర శక్తిని నిలువ చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీటిపై ఉంచిన ప్రసాదాన్ని భుజించడం వలన అన్ని రకాల వ్యాధులు నశిస్తాయన్నది ఆయుర్వేదం చెప్తుంది.
దేవాలయం చరిత్ర- అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం ద్వాపర యుగంలో పతిష్ట జరిగినట్లుచెబుతారు. అప్పటి నుంచి ఆదిత్యునికి దేవతలు, మహర్షులు చేత అర్చనలు అభిషేకాలు జరుగుతుండేవట. తరువాత కాలంలో 7వ శతాబ్ధంలో కళింగరోజుల పరిపాలనలో ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందినట్లుగా శాసనాల్లో లిఖించబడి ఉన్నాయి. గంగరాజులచే ఆలయ నిర్మాణం....అరసవల్లి దేవాలయాలన్ని గంగ వంశరాజు గుణవర్మ వారసుడైన కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించారు. క్రీస్తు శకం 673వ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా స్పష్టమైంది. అయితే ఈ ఆలయాన్ని దేవేంద్రుడు నిర్మించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. 16వ శతాబ్దంలో హర్షవల్లి ప్రాంతానికి చెందిన నిజాం నవాబు సుబేదార్‌గా వచ్చిన షేర్ మహ్మద్ ఖాన్ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో ఉంది. ఇతని వద్ద పనిచేసే సీతారామస్వామి అనే పండితుడు ఖాన్ దండయాత్రను ముందుగానే గ్రహించి మూలవిరాట్టును తీసుకుని ఒక బావిలో పడవేసాడని, కొన్నాళ్ల తరువాత 1778లో యలమంచిలి పుల్లాజీ పంతులు బావిలోని మూలవిరాట్‌ను కనుగొని, ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లుగా మరొక కథనం ఉంది. 1999లో జిల్లాలో సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన వరుదు బాబ్జి దంపతులు ఆలయ వాస్తు దెబ్బతినకుండా దక్షిణాది పద్దతిలో కాకుండా ఓడ్ర (ఒరిస్సా) సంప్రదాయ శైలిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.
ఆదిత్యుని విగ్రహం- శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధిలో ప్రతిదీ ప్రత్యేకతే. స్వామివారి దేవాలయానికి ఎంత చరిత్ర ఉందో, పుష్కరిణికి కూడా అంతే చరిత్ర ఉంది. స్వామివారి విగ్రహం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ఉషా, ఛాయా పద్మినీ సమేతుండైన శ్రీ సూర్యనారాయణ స్వామివారు, సప్తాశ్వ రధంపై నిలుచుని ఉండగా, పైన సనకసనందులు వింజామరలతో, స్వామివారు రెండు హస్తాల్లో రెండు తామర పూలతో ఉండే విధంగా కృష్ణ శిలపై కళాత్మకంగా తీర్చి దిద్దబడిన ఏకశిలా విగ్రహం ఉంది. దీనిని అరుణ శిల అని కూడా చెబుతుంటారు. ముఖ్యంగా మూలవిరాట్‌ను దేవశిల్పి విశ్వకర్మ రూపొందించగా, దేవేంద్రుడు ప్రతిష్టించి పూర్ణారోగ్యవంతుడుగా నిలిచాడనేది పురాణాలు చెబుతున్నాయి.
ఆదిత్యాయ నమోస్తుతే- ప్రాతఃకాల సమయంలో ఆదిత్యాయ నమోస్తుతే అంటూ సూర్యనమస్కారాలు చేయడం ఇక్కడి ప్రత్యేకం. ‘తూర్పు రోగి.. దక్షిణ భోగి.. ఉత్తర యోగి.. పశ్చిమ త్యాగీ’ ధర్మశాస్త్ర వచనమిది. ఇలా బంగాళాఖాతం అంటే రోగగ్రస్తమైన ప్రదేశమని పేరొచ్చింది. తూర్పు నుంచి వీచే గాలులు నష్టం కలిగిస్తాయన్న కొందరు అంటారు. వీటి బారి నుంచి తప్పించుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మహా పుణ్యక్షేత్రం అరసవల్లిలోని ఆదిత్యుని ఒక్కసారైనా దర్శించి తరించాలని ప్రజలు తరలి వస్తుంటారు. ఆదిత్యునికి నిర్వహించే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఇతర యాగాల్లో పాల్గొనడం అందరికీ సాధ్యం కాకపోయినా, స్వామిని దర్శించి సూర్యనమస్కారం చేయడం ద్వారా సామాన్యులకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పండితుల ఉవాచ త్రిచ, సౌర, అరుణ మంత్రాలతో నిత్యం ఆయా యోగ ప్రక్రియలు సాధన చేయడం ద్వారా మనిషి అత్యంత ఆరోగ్యవంతునిగా, దీర్ఘాయుస్సు పొందుతాడని శాస్త్రం చెబుతోంది. శ్రీ సూర్యభగవానుని అరుణ కిరణాలు నేరుగా గర్భాలయంలో మూలవిరాట్టును తాకిన సమయంలో అరుణశిలా విగ్రహమైన సూర్యనారాయణుడు బంగారువర్ణంతో మెరిసిపోతుంటారు. ఏడాదికి రెండు పర్యాయాలు మాత్రమే సూర్యకిరణాలు నేరుగా స్వామిని తాకుతాయి. గాలి గోపురం మధ్య నుంచి సూర్యకిరణాలు ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారి పాదాలనుతాకుతాయ.
- ఉరిటి శ్రీనివాస్

Add new comment

CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
Loading